అమ్మో అమ్మాయిలు 48

Listen Audio File :

ఆ సాయంత్రం అటు వ్యాకర్ణ, ఇటు అబ్బులు చెరో దారి పట్టిపోయారు. కొత్త సినిమా పేరు చెప్పి యిద్దరం కలిసి వెళుతున్నామని చెప్పి యింట్లోంచి కలిసి బయలుదేరిన జయచిత్ర, బిందురేఖ వీధి మలుపు తిరగగానే విడిపోయారు.

రెండు జంటల కోరిక తీరిన వేళ సినిమా వదిలిన వేళ తృప్తి నిండిన మనసులతో ఎవరి దోవన వాళ్ళు సంతృప్తిగా యింటికి చేరారు. ఆ రోజు మొదలు మొత్తానికి అటూ ఇటూ పెద్దవాళ్ళకి అనుమానం రాకుండా రెండు జంటలు ఏదో వంకతో యింట్లోంచి జయటపడి ప్రేమ వూసులు ఆడుకుంటూనే వున్నాయి.

ఓ రోజు అటు పెద్దలు యిటు పెద్దలు కల్సి పెళ్ళి ముహూర్తం ఫలానా రోజు అన్నారు. “అప్పడే నెలా ఇరవై రోజులు పూర్తి అయాయా!” అన్నాడు వ్యాకర్ణ కాస్త దిగులుపడుతూ.

“బహుశా అయే వుంటుందిరా. ఎందుకంటే శాస్త్రిగారు వచ్చారు. మనవాళ్ళు వచ్చారు, పెళ్ళి ముహూర్తం కూడా పెట్టేశారు కదా!” ఆలోచించి మరీ చెప్పాడు అబ్బులు.

“మన పెళ్ళి సరిగ్గా వారం వుంది. గతం తిరగతోడుకుని లాభం లేదు. మన ప్రేమలకు పులిస్టాప్ పెట్టక తప్పదు. పైగా మన పెళ్ళిళ్ళు పెళ్ళి కూతుళ్ళ స్వగ్రామం పల్లెటూరులో జరుగుతుంది. కాబట్టి తెల్లారి అమ్మాయిలిద్దరూ వాళ్ళ వాళ్ళతో కలిసి వాళ్ళ ఊరు చెక్కేస్తున్నారు. చివరి సారిగా మనం కల్సుకుని మాట్లాడాలి కదా!” అన్నాడు వ్యాకర్ణ.

“అవుననుకో. ఇటు బామ్మగారు అటు భక్తగణం కాక కాబోయే మామగార్లు అత్తగార్లు యింకా ఆ బాపతువాళ్ళు మన బాపతువాళ్ళు పెళ్ళి కూతుళ్ళకి రక్షణ కవచాల్లా బోలెడుమంది వున్నారు కదా!” అన్నాడు అబ్బులు వాళ్ళందరిని గుర్తు చేస్తూ.

“ఎలా?” అన్నాడు వ్యాకర్ణ.

'అవును ఎలా!” అన్నాడు అబ్బులు.

ఆ తరువాత ఎవరి తల వాళ్ళే పుచ్చుకుని తీవ్రాలోచన చేశారు. చిన్న అయిడియా కూడా రాలేదు. ఈ రోజు అమ్మాయిలిద్దరూ సినిమాకి రారు. షాపింగ్ కి రారు. మళ్ళీ చెప్పాలంటే అసలు బయటికే రారు. ఎలా? చేతులు కాళ్ళు గాక శరీరం మొత్తం, మనసు అంతా... ముళ్ళ తాళ్ళతో బిగించి కట్టేసినట్లు వుండిపోయారు అబ్బులు వ్యాకర్ణ. ఏ ఉపాయము తోచనప్పుడు ఎవరైనా చేసేది చేతులు

కట్టుకు కూర్చోటమే. ఆ రాత్రి.............

కబుర్లు చాలించి అందరూ నిద్రపోతున్న వేళ. బామ్మగారు వ్యాకర్ణని అబ్బులిని రహస్యంగా పిలిచారు "మీ యిద్దరితో అమ్మాయి లిద్దరూ ఏదో ముఖ్యమైంది మాట్లాడాలి అంటున్నారు. మాట్లాడి రండి" అంటూ పెరటివైపు పంపించారు.

అంతేకాక బామ్మగారు అమ్మాయిలిద్దరితో కూడా ఇదే మాట చెప్పి పంపారు. ఆ తర్వాత బామ్మగారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముళ్ళకిరీటాన్ని సవరించుకుని హాలులో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.

పెరట్లో జయచిత్రని కలుసుకున్న వ్యాకర్ణ "మీ బామ్మచేత ఎంత ధైర్యంగా కబురు చేశావు జయచిత్రా!” అన్నాడు ఆనందంగా.

“జోకులు చాలించండి మీరేదో మాట్లాడాలి అన్నారుట, తప్పేదేముందని బామ్మ ఈ ఏర్పాటు చేసింది" చిరుకోపంతో అంది జయచిత్ర,

వాళ్లిరువురు అపార్ధంలోంచి బైట పడటానికి సరిగ్గా పది నిమిషాలు ఒక్కక్షణం పట్టింది 'ఔరా బామ్మగారూ!' అనుకున్నారు.

“మిమ్మల్ని ఏమో అనుకుని ఏదేదో మీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. పెళ్ళి ముహూర్తం పెట్టారుకదా అని ఇంత యిది పనికిరాదు. నెల రోజుల బట్టి కల్సుకుంటూనే వున్నాము కదా! ఈ నాలుగురోజుల్లో కొంపలేం మునిగాయి, పైగా బామ్మగారి చేత కబురు చేస్తారా!” బిందురేఖ కయ్యిమంది. “దెయ్యంగాని పిచ్చిగాని పట్టిందా లేక పిచ్చి దెయ్యం పట్టిందా! సిగ్గుల మొగ్గల పెళ్ళి కూతురు సిగ్గుపడాల్సింది పోయి డేరింగ్గా బామ్మగారి చేతనే రాయబారం పంపి పైగా నా మీదనే యింత అభాండమా!” అబ్బులు ఆశ్చర్యంతో తల మునకలవుతూ అడిగాడు.

సరిగ్గా వాళ్ళ మధ్య అపోహ తొలిగి అసలు విషయం అర్ధంకావటానికి అయిదు నిముషాల అరసెకన్ పట్టింది. “ఎంత మంచివారి బామ్మగారూ!” అనే అర్ధంతో ఆశ్చర్యపోయి ఆపై ఆనందించారు. కొద్దిసేపు తర్వాత రెండు జంటలు బామ్మగారి దగ్గరకు వచ్చాయి. కూడబలుక్కున్నట్లు వాళ్ళంతా ఒకేమాట అన్నారు.

“మమ్మల్ని క్షమించాలి బామ్మగారూ!”

“ఎందుకు! మీరేం తప్పు చేశారు. అంతకాని పనేం చేశారు!” బామ్మగారు అడిగారు.

“మా మనసుల్లో కోరిక మీరు పసిగట్టి మీరు మేము కలుసుకుని మాట్లాడుకునేలా ఏర్పాటు చేశారు. ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ మిమ్మల్ని మరచిపోము" అన్నారు నలుగురు.

“మంచిది" అంది బామ్మగారు ముక్తసరిగా.

“మమ్మల్ని క్షమించాలి బామ్మగారూ! మీరింత మంచివారని తెలియక మేము ఈ నెలా ఇరవై రోజులలో మీ ఆజ్ఞ లేకుండా చాటుమాటుగా కల్సుకున్నాము" మళ్ళీ నలుగురు ఏకకంఠంతో అన్నారు.

“నాకు తెలుసు..........” బామ్మగారు గంభీరంగా అన్నారు.

“మీకు తెలుసా?” నలుగురు నాలుగు రకాలుగా తెల్లబోయారు.

“తెలియటమేమిటర్రా! మీరు కల్సుకోటానికి వీలు లేకుండా ఆంక్ష పెట్టింది నేను. ఎందుకంటే మీది యువతరం. మీ నెత్తుటి వాడి వేడి అల్లరి ముచ్చట అంతా నాకు తెలుసు. నేను ఆంక్ష పెట్టంగానే దొంగచాటుగా కల్సుకున్నారు గడ్డుజామకాయ తిన్నా రుచిగా చాటుమాటు తింటేనే బాగుంటుంది ప్రేమతో ఆదుర్దా తొందర భయము. దానిలో అనురాగము మీరు జీవితాన్ని ప్రేమ రుచిత చేరువయి జన్మజన్మలకు గుర్తుండేలా అనుభవించారు.

ఆ మూడు ముళ్ళూ ముచ్చట పూర్తి కాగానే ఏముందర్రా. పెళ్ళి భర్త భార్యా సంసారం పిల్లలు రోగాలు రోచ్చులు, కష్టసుఖాలు కావడికుండలు పాత బట్టలకి స్టీలు సామానులు" అంటూ బామ్మగారు బొలబొల నవ్వారు బోసి నోటితో.

అవాక్కయిపోయిన నలుగురు అయిదు నిమిషాల తర్వాత తేరుకుని ఆశీర్వదించమంటూ బామ్మగారి కాళ్ళని కళ్ళకద్దుకుని లేచారు.

బామ్మగారు చాలా ఘాటుగా దీవించారు.

ఆ దీవెన విని అందరూ నవ్వారు. ఆ దీవెన ఏమిటి అంటే "మొదటి కాన్పులో నాలాంటి అమ్మాయిని కనమని......”

“ఉన్న అమ్మాయిలు (జయచిత్ర బిందురేఖ) చాలక..........” అన్నాడు వ్యాకర్ణ.

“అమ్మో అమ్మాయిలే" అన్నాడు అబ్బులు.

“కనేది మీరు కాదు కదర్రా అమ్మాయిలు కదా!” అంది బామ్మగారు అమాయకత నటిస్తూ.

అమ్మాయి లిద్దరూ ఫక్కున నవ్వారు.

అబ్బులు, వ్యాకర్ణ తప్పనిసరి అయి నవ్వారు వాళ్ళతో కలిసి బామ్మగారు నవ్వారు. నెత్తిన ముళ్ళ కిరీటాన్ని సవరించుకుంటూ.....