అమ్మో అమ్మాయిలు 46

Listen Audio File :

తానేమి చేయ్యబోతున్నది వ్యాకర్ణ ఏం చేయాల్సింది అబ్బులు వివరంగా చెప్పాడు. చాలా బాగుందన్నాడు వ్యాకర్ణ. ఇరువురు ఆ విషయమే కాసేపు చర్చించుకున్నారు.

ఆ సాయంత్రం...... వ్యాకర్ణ బామ్మగారింట్లోకి, అబ్బులు భక్తబృందం యింట్లోకి నడిచారు.

“రా నాయనా!” అంటూ బామ్మగారు చిరునవ్వుతో ఆహ్వానించారు.

“చచ్చితి చచ్చితి....” అనుకుంటూ ఆ "ఈ రోజు వాళ్ళింట్లో భజన అనుకుంటాను మీరు వెళ్ళరా బామ్మగారూ అని మర్యాదగా అడిగారు.

“వారానికి రెండుసార్లు భజన చేస్తాడు. ప్రతిసారి వెళ్ళాలని ఏముంది!” అని "జయచిత్ర కోసమా?” అంది వ్యాకర్ణ ని గుచ్చిగుచ్చి చూస్తూ.

“జయచిత్ర కోసమే వచ్చాను, అని ఎలా చెపుతాను బామ్మగారూ! మీరు భజనగాళ్ళింటికి వెళ్ళి వుంటారని జయచిత్రకోసం వస్తే మీరేమో యిక్కడే వుంటిరి........” అని మనసులో అనుకుంటూ, ఆ.... రామాయణం వుందేమో ఓసారి తీసుకెళ్ళి చదివి యిస్తాను" వినయంగా అన్నాడు వ్యాకర్ణ. పక్క గదిలో జయచిత్ర వున్న సూచనగా గాజుల చప్పుడు అయింది. వ్యాకర్ణ హృదయం లయ తప్పినట్లయింది.

వ్యాకర్ణని అనుమానంగా చూస్తూ "రామాయణమా?” అంది బామ్మగారు.

“అవును రామాయణమే" అన్నాడు వ్యాకర్ణ.

“నీకు రామాయణం ఎందుకు నాయనా!”

“ఎందుకంటే...... ఆ.... ఎందుకంటే...... చదవటానికి. ఈ వయసులో రామాయణ భారతాలు ఈ కాలం కుర్రాళ్ళు చదువుతారా? అని మీకు వింతగా వుండవచ్చు. నేను భారతం అడిగేది ఎందుకంటే.....”

“భరతం కాదు నాయనా రామాయణం" సరిదిద్దింది బామ్మగారు.

"ఆ........... అదేలేండి రామాయణం అనబోయి భారతం అన్నాను. ఏదైతే నేమి అన్ని పవిత్ర గ్రంథాలే కదా!”

“అదెలా?” అంది బామ్మగారు.

అదేలాగో చెప్పలేదు గాని మరొకటి చెప్పాడు వ్యాకర్ణ "అబ్బులుగాడు నాతో పందెం వేశాడు లెండి. ఆంజనేయుడి చెల్లెలి పేరు అరుంధతి అంటాడు వాడు. కాదు అహల్య అంటాను నేను. వంద రూపాయలు పందెం కూడా వేసుకున్నాం" వ్యాకర్ణ చెబుతుంటే పక్కగదిలో వున్న జయచిత్ర కిసుక్కున నవ్వింది. అయితే, ఈ లోపలే బామ్మగారు బొల బొలలా నవ్వటంతో వ్యాకర్ణ నోరు మూసుకున్నాడు.

“హనుమంతుల వారికి అరుంధతి గానీ అహల్య గానీ చెల్లెలు కాదు.”

“మరి అప్పగారా?” ఆదుర్దాగా అడిగాడు వ్యాకర్ణ.

అతగాడి ప్రశ్నతో విషయం చూచాయగా అర్థమైంది బామ్మగారికి. “అప్పకాదు చెల్లెలు కాదు పెద్ద మేనత్త కూతురు ఒకావిడ, రెండో మేనత్త కూతురు మరొకావిడ. మీరిద్దరూ పందెం గెలవనట్లే! అన్నట్టు మా ఇంట్లో రామాయణం లేదు. కొనాలి కొనాలి అని ఎప్పటికప్పుడు అనుకోవటమే తప్పించి ఎప్పుడూ కొన్న పాపాన పోలేదు.”

“మీ చిన్నప్పటి చిత్రం అనుకుంటాను. ముగ్గురు మరాఠీలు సినిమా వచ్చింది, ఈ రోజే సాయంత్రం ఫస్ట్ ఆటకు వెళ్తున్నాను కాస్త ముందుగా వెళ్లి రామాయణం కొంటాను" ఉపాయంగా జయచిత్రకు కోడ్ అందిస్తూ చెప్పాడు వ్యాకర్ణ.

ఈవాళ్ళే కొనకపోతే ఫరవాలేదు నాయనా. “అబ్బులు అలాంటి పాత సినిమాలకు రానన్నాడు, నేను ఒంటరిగానే ముందుగా వెళుతున్నాను, రామాయణం నా చేతులతో కొనటం నా అదృష్టం అని భావిస్తూ కొంటాను. అడ్డు పెట్టకండి బామ్మవారు!” అన్నాడు వ్యాకర్ణ.

బామ్మగారు బోలెడు ఆనందంతో "నీ యిష్టం" నాయనా అంది.