అమ్మో అమ్మాయిలు 42

Listen Audio File :

ఇంట్లో వీళ్ళ ప్రేమ విషయం బయటపడకముందు హాయిగా దొంగచూపులు చూసుకుంటూ ఓటోట్టి కోపాలు ప్రదర్శించుకుంటూ ఎంచక్కా రోజు మొత్తం మీద పదిసార్లు కలుసుకుంటూ ప్రేమించు కున్నారు. వాళ్ళ ప్రేమ విషయం బయటపడి పెళ్ళి దాకా వచ్చేసరికి పెళ్ళి లోపల కలుసుకోరాదు మాట్లాడుకోరాదని పెద్దలు ఆంక్ష పెట్టారు.

పెద్దలు గీసిన గీటు దాటలేక వీళ్ళు అతలాకుతలం అయిపోతున్నారు. నెలా ఇరవైరోజులు అలా వుండాలంటే ఎంత కష్టం? ఈ విషయంలోనే మిత్రులిద్దరూ దిగులులాంటిది పడుతుంటే కాబోయే పెళ్ళికూతుళ్ళు వచ్చి అంతా స్వాములవారి దర్శనానికి వెళ్ళారని చెప్పారు.

“నెలా ఇరవైరోజుల దాకా మంచి ముహూర్తాలు లేవా! నేను నమ్మను, మన పెళ్ళిచేసే శాస్త్రిగారు ఈ నెలా ఇరవై రోజులు ఏ యింట్లో అయినా తద్దినం పెట్టటానికి ఒప్పుకున్నారేమో!” అన్నాడు అబ్బులు.

అబ్బులుకి అటు రష్యానుంచి ఇటు అమెరికా వరకు అన్నీ తెలుసు గాని తద్దినాలు శార్ధాలు దిక్కుమాలిన ఆచారాలు పెళ్ళికి మాసికానికి తేడాలు బొత్తిగా తెలియవు. స్వామీజీలన్నా నాకుడు పీకుడు బాబాలన్నా మహా మంట, నోరు వాయలేనిరాళ్ళని పట్టుకుని దేవుళ్ళంటే నమ్ముతానేమోగాని నీలాంటి మనిషి వేషం మార్చి నేనే దేవుడినినంటూ తయారైతే మాత్రం వాడి పళ్ళు పట్టకారుతో పీకి వాడిచేతనే బలవంతానా మింగించాలంటాడు.

అబ్బులు అన్నది విని "మీకేం తెలియదు. నెలా ఇరవై రోజులంటే సరిగా యాభైరోజులు ఒకే యింట్లో యాభై తద్దినాలు వరసగా పెట్టరుగాక పెట్టరు" అంది బిందురేఖ.

“ఎందుకు పెట్టరు!” అబ్బులు మొండి వాదనలోకి దిగుతూ అడిగాడు.

“మరీ విచిత్రం ఒకే యింట్లో యాభైమంది ఎలా చస్తారు!”

“ఎందుకు చావరు! చచ్చేరోజు వస్తే చచ్చినట్లు చస్తారు.”

“యాభైమంది ఉండొద్దా!”

“ఎందుకు ఉండరు! ఒక్కొక్కళ్ళు వందమందిని కంటుంటే ఇంటికి వందేం ఖర్మ యింకా ఎక్కువే వుంటారు. వాళ్ళలో ఓ యాభైమంది చస్తే నిక్షేపంగా యాభై తద్దినాలు పెట్టొచ్చు"

“మీ లెక్కలు నాకు తెలియవు బాబూ! నాకు తెలిసినంతలో పెళ్ళిళ్ళు చేసే శాస్త్రిగారు తద్దినాలు పెట్టరు?”

“అదేం పాపం? పెళ్ళి చేసి తద్దినం పెడితే ఎడాపెడా డబ్బు వస్తుంది కదా!”

“శాస్త్రం ఒప్పదు"

“ఎందుకు ఒప్పదు, అంతా శాస్త్రం ఇష్టమేనా! శాస్త్రిగారి యిష్టంమంటూ ఏమిలేదా!” గట్టిగా అడిగాడు అబ్బులు.

"అదేమో నాకు తెలియదు" అంది బిందురేఖ.

“అబ్బులూ! నెలా ఇరవై రోజులదాకా పెళ్ళి ముహూర్తాలు లేవనే కదా మనసు అంతగా పాడు చేసుకున్నావ్! మనిద్దరం ఒకే నావలో ప్రయాణిస్తున్న ప్రేమ బాధితులం.....” అంటూ యింకేదో చెప్పబోయాడు వ్యాకర్ణ.

“నా బాధని అర్థం చేసుకున్నావ్ చాలురా కర్ణా!” భారంగా పలికాడు అబ్బులు.

“మనం పట్టుమని పదిరోజులు కూడా గట్టిగా ప్రేమించుకోలేదు. ఎలాగూ పెళ్ళికి నెలాయిరవై రోజులు గడువు వుంది. ఈలోపల గాఢంగా ప్రేమ వూసులు ఆడుకుంటే పోలేదా?” వ్యాకర్ణ ఉపాయం చెప్పాడు.

“వూసులా పూసలా, రేఖవాళ్ళ చుట్టాలు ఆ భక్తబృందగాళ్ళు బిందురేఖ మీద నిఘా వేశారు. మమల్ని అసలు కలుసుకోనిస్తేనా?”

“నిజమేరా నా పని అలాగే వుంది. అంత మంచి బామ్మగారు కూడా పెళ్ళిదాకా కథ వచ్చేసరికి నన్ను జయచిత్రని కలుసుకోనివ్వటం లేదు. మనం పెద్దవాళ్ళ కళ్ళుగప్పి ప్రేమ వూసులాడుకోవటం ఉత్తమోత్తమం. పెళ్ళి అయిన తరువాత ప్రేమ జంటలు కువకువ లాడుతూ ఒకరితోనొకరు ఒదిగి పోవటం అన్నది అంత అందంగా వుండదు కాబటి.......”

“ఎందుకు అందంగా వుండదు! అలా అని ఎవరు చెప్పారు. పెళ్ళయింతరువాత పెళ్ళాన్ని ప్రేమించమా?” అబ్బులు పిడివాదనలోకి దిగాడు.

“చూడబ్బాయ్?”

“చూశాను"

“పెళ్ళి అయింతరువాత పెళ్ళాం ప్రేయసి కాదు, ఆ ప్రేమ వేరుగా వుంటుంది. పెళ్ళాన్ని డైరెక్టుగా కలుసుకోవచ్చు. పట్టే మంచంమీద బాసిపెట్లు వేసుకుని కూర్చుని. “జలజా! కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అనొచ్చు.....”

“అదిసరే, ఇంతకీ ఈ జలజాక్షి ఎవరుట?” అబ్బులుకి పెద్ద అనుమానం వచ్చి అడిగాడు.

“జలజలు జమునలు యిక్కడ ఎవరు లేరు, మాట వరుసకి చెప్పాను. పెళ్ళాన్ని పేరుతోనే పిలవాలని ఎక్కడా లేదు. ఏయ్! ఓ గ్లాసు నీళ్ళు తీసుకురా! ఒసేయ్ ఎక్కడ చచ్చావే! కొంబుచెంబు మొహమా? ఉప్పులో యింత పప్పు తగలేశవేం అంటూ ధాంధూంలు చెయ్యొచ్చు.” మహా హుషారుగా చెప్పుకుపోతున్నాడు వ్యాకర్ణ.

“అబ్బ, పెళ్ళయిన మగాడికి ఎన్ని ఛాన్సులురా!” ఆనందంతో గుటకలు మింగాడు అబ్బులు