Home » Ammo Ammayilu » Ammo Ammayilu

Rating:             Avg Rating:       306 Ratings (Avg 2.94)

అమ్మో అమ్మాయిలు 44
Listen Audio File :

బిందురేఖ పకపక నవ్వింది. "నీకు అసలు విషయం అర్థంకాక తల్లడిల్లిపోతున్నావే తల్లీ!” అంది.

“విషయం చెప్పి నవ్వు" జయచిత్ర సీరియస్ గా అంది.

“నెలా యిరవై రోజులదాకా పెళ్ళి ముహూర్తాలు లేవని తెలిసి మనలాగానే వాళ్ళు కూడా తల్లడిల్లి పోతున్నారే. పైగా మనం కలుసుకుని మాట్లాడు కోవటానికి వీలు లేకుండా పెద్ద తలకాయలు అడ్డుగోడగా నిలిచాయి. మనం పడే బాధే వాళ్ళు పడుతున్నారు......”

“పెద్ద తలకాయలకెందుకు బాధ?” జయచిత్ర గయ్యిమంది.

“వాళ్ళకి కాదు బాధ మనకు కాబోయే భర్తలకు. ఆ బాధ భరించలేక కొద్దిగా మతి చలించి పిచ్చి వాగుడులోకి దిగారు. అది జరిగింది" బిందురేఖ వివరించింది.

“మనకి బాధగానే వుంది కదా!” జయచిత్ర అనుమానం బయట పెట్టింది.

“మనం వేరు వాళ్ళు వేరు మనం మనమే వాళ్ళూ వాళ్ళే. ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ళు కాలేము వాళ్ళు మనలా కాలేరు. మనము వాళ్ళూ......” ఇంకా ఏదో చెప్పబోతుంటే

“ముందు ఆ అరిగిపోయిన రికార్డ్ ఆపు. తెలుగు సినిమాలు తక్కువగా చూడావే తల్లీ అంటే వినవు. ముఖ్యంగా ఇలాంటి మెలికల భాష వాడే దర్శకుడి సినిమాలు అసలు చూడవద్దే తల్లీ అంటే నా మాట పెడచెవిన బెట్టి ఆ గడసరి తీసిన సినిమాలకే ముందు వెళతావాయె. నేను ఎంత వాపోయి ఏమి లాభం మెలిక భాష మానేసి విషయానికి రా" అంది జయచిత్ర.

“ఆడవాళ్ళు సహనశీలులు. మెన్ను విరిగి మీదపడ్డా చలించరు. భర్త బెల్టు తీసుకుని వుతికితే పప్పు పులుసు తిన్నంత తేలికగా తీసుకుంటుంది. అవమానాలు అపనిందలు తలనొగ్గి స్వీకరిస్తుంది. పురిటి నొప్పులప్పుడు అమ్మో అంటూ ఆకాశం విరిగిపడేలా, అబ్బా అంటూ భూమి బీల్లు పారేలా పెడబొబ్బలు పెట్టే స్త్రీమూర్తి ఏడాది తిరక్కుండానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మరో బిడ్డకు జన్మనివ్వటానికి రెడీ అవుతుంది.

సహనము ఓర్పు నేర్పు భరించుట తగ్గివుండుట యిలా చాలా చాలా వాటిలో స్త్రీ మునగానాం తేలానాంగ లాగా అలవాటు పడివుంటుంది. అలాంటి పరమ పవిత్రమైన స్త్రీజన్మ ఎత్తిన వాళ్ళం మనం. మగవాళ్ళకున్న వీక్ మైండ్ మనకి వుండదు కనుక.......”

“అబ్బ, నా మట్టి బుర్రకి యిప్పుడు అర్థమైంది. వివాహం ఆలస్యం అయి విరహబాధ భరించలేక మతి పోగొట్టుకుంటున్నాడంటావ్ అంతేనా!” జయచిత్ర తగ్గిపోతూ అంది.

“అంతేనా అని చిన్నగా అంటావా! సరిగ్గా అంతే" గట్టిగా చెప్పేసింది బిందురేఖ.

“అనవసరంగా వాళ్ళ మీద కోపగించుకుని వచ్చేశాము కదా!”

“అవుననుకో, అప్పుడప్పుడు ఆ మాత్రం ఉప్పు కారం తగిలించకపొతే మగవాళ్ళు మన చెప్పు చేతల్లోంచి జారిపోతారు. పైగా....”

“ఊ......... పైగా.....!” ఆత్రుతగా అడిగింది జయచిత్ర.

“మనం పట్టుమని గట్టిగా ప్రేమించుకున్నది లేదు....”

“మనం ప్రేమించుకోవటం ఏమిటే, వాళ్ళతో పాటు నీక్కూడా మతి పోయిందా!”

“మతి మతిగానే వుంది మాటలే తారుమారయాయి. మనం ప్రేమించుకోవటం అంటే నిన్ను నేను నన్ను నీవు అని కాదు. వాళ్ళిద్దరు మనని మనం వాళ్ళని అలాగన్న మాట.”

'ఓహో అలాగా, ఇప్పుడు అర్థం అయింది. నిజమేనే రేఖ! మనం గట్టిగా పట్టుమని ప్రేమించుకున్నదే లేదు"

“కనుక మనకి ఈ నెలా ఇరవై రోజుల్లో ప్రేమ ఊసులాడుకోటానికి బోలెడు సమయాలు కావాల్సినంత టైము ఉన్నాయి. ఆ మూడు ముళ్ళూ మన మెడలో పడ్డా మరుక్షణం ఇంక ప్రేమ ఉండదు దోమ ఉండదు. సంసారం అనే మహా సాగరంలో పడి కొట్టుకు చస్తుంటాము. కనుక సరదాగా ప్రేమించుకుంటూ అందరి కళ్ళూ గప్పి చాటుగ కల్సుకుంటూ ఈనెలా ఇరవై రోజులు గడిపేద్దాము.”

“నీవు చెప్పుతుంటే ప్రేమసాగరంలో ఈత కొడుతున్నట్లు..... ప్రేమామృతం గ్రోలుతున్నట్లు వుంది. కాని నాకో పెద్ద అనుమానం.”

“ఏంటది!”

“మనం వాళ్ళ మీద కారాలు, మిరియాలు నూరి వచ్చాము కదా, వాళ్ళు కోపగించుకుని మనని లెక్కచేయకపోతే యింకా ప్రేమేమిటి నా బొంద........!” విచారంగా అంది జయచిత్ర.

“పిచ్చిదానా! అక్కడే నీవు పప్పులో కాలు వేశావు. వాళ్ళూ మగవాళ్ళు. వాళ్ళబుద్ధి చంచలం. మనం కనబడితే చాలు వాళ్ల బుర్ర పని చేయదు. గుడొచ్చి చేలో పడ్డట్లు అనుకో" బిందురేఖ తేలికగా చెప్పింది.

“అనుకున్నాను" తృప్తిపడుతూ అంది జయచిత్ర.

భక్తబృందంతో గుడికి వెళ్ళిన బామ్మగారు అప్పుడే లోపలి వస్తూ "ఏమిటే అనుకున్నది!” అన్నారు.

“ఆదా! అది... పిండి వడియాలు ఎలా పెట్టాలని నేను అడిగాను. ఎలా పెట్టాలో చెపుతున్నది. బిందురేఖ అదన్నమాట............” నోటి కొచ్చింది చెప్పింది జయచిత్ర.

“పిండి వడియాలు ఎలా పెట్టాలే అమ్మాయీ!” బామ్మగారు ముళ్ళకిరీటాన్ని ముఖం మీదకు లాక్కుంటూ ఏమి తెలియనట్లు అడిగారు. జయచిత్రని నమిలి మింగేటంత కోపంతో చూసింది బిందురేఖ.

"ఎలాగో అలా ఈ గండం గట్టెక్కించవే రేఖ!” అన్నట్లు చూసింది జయచిత్ర.

"సరే" అన్నట్లు చూసింది బిందురేఖ.