Home » Ammo Ammayilu » Ammo Ammayilu

Rating:             Avg Rating:       261 Ratings (Avg 2.90)

అమ్మో అమ్మాయిలు 43
Listen Audio File :

అబ్బులు అలా అనేసరికి జయచిత్ర, బిందురేఖ ఛర్రున లేచారు "ఇదిగో!” అంటూ.

"ఇద్దరూ యిక్కడే వున్నారురోయ్!” అంటూ కెవ్వుమన్నాడు వ్యాకర్ణ.

“అవునురోయ్!” అంటూ తను కెవ్వుమన్నాడు అబ్బులు.

“చాలించండి వేషాలు. మేము మీ ప్రక్కనే వుండగా!” ఇన్ని మాట్ల అంది జయచిత్ర.

“చూడనట్లు నటనా?” అంది బిందురేఖ.

“మేము మిమ్మల్ని నమ్మి ప్రేమించబట్టే కదా!”

“మాకింత అవమానం!”

“నాది కొంబు చెంబు ముఖమా?”

“ఈయనగారేమో పెళ్ళైన మగాడికి ఎన్ని ఛాన్సులో అని జబ్బలు చరుచుకోటమా?”

“మన ప్రాణానికి యిద్దరూ యిద్దరే"

“పోదాం పదవే.”

“ఊ..... పద.” జయచిత్ర, బిందురేఖ జంట కవుల్లాగా టపటప మాటలు పేల్చారు.

ఏదో చెప్పబోయిన వ్యాకర్ణ మాటలని జయచిత్ర వినిపించుకోలేదు. వాకిలికి అడ్డం రాబోతున్న అబ్బులిని బిందురేఖ అడ్డు తగిలింది. యిరువురు ప్లాట్ ఫామ్ విడిచిన గంగా కావేరిల్లా రయ్యిన గదిలోంచి వెళ్ళిపోయారు.

“గోవిందా గోవింద....” అన్నాడు అబ్బులు నెత్తిన చేయిపెట్టుకుని కుర్చీలో కూలబడుతూ.

“రామ రామ శివ శివ" అంటూ తను మరో కుర్చీలో కూలబడ్డాడు వ్యాకర్ణ. .

“ఎంత పనైంది?”

“అవునౌను. ఎంతెంత పనైంది?”

“అసలు నీ కళ్ళేమైయ్యాయిరా. లంఖణీ శంఖిణి మన పక్కనే వున్నారనిచూసుకు తగలడక్కరలేదా?”

“నా కళ్ళు పొరలేశాయి సరేనా! నీకేం వచ్చింది. నాలాగా నీకేమన్నా రెండేకళ్ళా? నాలుగు కళ్ళు అఘోరించాయి. ఆడ కోతులు మన ప్రక్కనే వున్నాయని చెప్పి చావక్కరలేదా?”

“అందుకే అన్నారు పెద్దలు.”

“ఏమని?”

“పెద్ద తలకాయ లేకపోయే ఎద్దు తలకాయ తెచ్చుకుని తగిలించుకోమని …........”

“ఏడ్చినట్లుంది.”

“ఎవరు ఎవరంట?”

“ఇంకెవరు నువ్వే. కళ్ళజోడు తీసి తుడుచుకుంటున్నావు కదా!”

“కళ్ళజోడు కన్నీళ్ళు కార్చదు. మైండిట్!” అబ్బులు అరచి మరి చెప్పాడు.

"అద్భుతమైన టైటిల్ సమాధి కడుతున్నాం. చందాలివ్వండి నాటకం పేరు విన్న తర్వాత మళ్ళీ యింతకాలానికి కొత్త నాటకానికో మంచి పేరు దొరికింది. కళ్ళజోడు కన్నీరు కార్చదు. వారెవ్వా?” మెరిసే కళ్ళతో మరి చెప్పాడు వ్యాకర్ణ.

“వ్యంగ్యమా?” సీరియస్ గా అడిగాడు అబ్బులు.

“కాదు, యదార్థమే" అన్నాడు వ్యాకర్ణ.

దాంతో యిరువురు చల్లబడ్డారు. కాసేపు చర్చించుకున్నారు. మరికాసేపు తీవ్రంగా ఆలోచించారు నెలా యిరవైరోజుల తర్వాత గాని పెళ్ళి ముహూర్తాలు లేవు. ఈ లోపల గాఢంగా ప్రేమించుకుంటూ దొంగచాటుగా కల్సుకుంటూ ప్రేమ వాక్యాలు పాడుకుంటూ, ఉంటే సరదాగా రోజులు వెళతాయని అనుకున్నారు.

“దూరంగా వున్నా ప్రియురాలిమీద ప్రేమ దగ్గరగా వున్న పెళ్ళాంమీద ఉండదని ఏ నవలలోనో చదివినట్లు గుర్తు. మనం ఘాటుగా ప్రేమించుకుందాము" అన్నాడు వ్యాకర్ణ.

“నీ బొంద మనం ప్రేమించుకోవటం ఏమిటి?” అన్నాడు అబ్బులు.

“మనము అంటే మనిద్దరం అని కాదురా అబ్బూ! మన ప్రియురాళ్ళతో...”

“ఓరోరేయ్ ఆగరా తండ్రీ! మన ప్రియురాళ్ళు. మన భార్యలు యిదేం భాషరా తండ్రీ......”

వ్యాకర్ణ అబ్బులు వీళ్ళిలా యిక్కడ వాదించుకుంటే అక్కడ జయచిత్ర బిందురేఖ గుసగుస లాడుకుంటున్నారు యిదే విషయంలో. “ఇంట్లో యిటు మా బామ్మలేదు. అటు మీ భక్తబృందము లేరు కదా అని బోలెడు సరదాపడిపోయి వాళ్ళ గదిలో దూరితే మనతో ఊసులాడటం లేకపోగా అసలు మనం అంటే లెక్కలేనట్లు మనం ఆ గదిలోనే లేమన్నట్లు చింతకాయ కబుర్లు చెప్పుకుంటున్నారు. వనిత తనకు తానై వలచి దగ్గరకు చేరితే పురుషుడు ఎడంకాలితో తంతాడని వూరికే అన్నారా.హ్హూ..” అంది ముక్కు ఎగబీలుస్తూ జయచిత్ర.

“ఊరుకో" అంది బిందురేఖ.

“ఇంత అనుమానం జరిగితే ఎలా ఊరుకోను!” అంది జయచిత్ర.